కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే కనిపిస్తోంది. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమని ఎప్పుడో నిర్ధారణకు వచ్చిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఆపరేషన్ జరిపినట్లు గత వారం రోజుల పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వైయస్ జగన్ ఈగోను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటూనే ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా వైయస్ జగన్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీసేందుకు పూనుకుంది. తన తండ్రి వైయస్సార్ ప్రభుత్వంలో శాసనసభా స్ఫీకర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తనకు వ్యతిరేకంగా రంగంలోకి దింపుతున్నట్లు వైయస్ జగన్ కు అర్థమైంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగానే హుటాహుటిన వైయస్ జగన్ బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ సిఎల్పీ సమావేశం ప్రణబ్ అనుభవంతో వ్యూహాత్మకంగా చడీ చప్పుడు లేకుండా ముగిసింది. అది వైయస్ జగన్ కు తీవ్రమైన దెబ్బనే.
ముఖ్యమంత్రిగా ఎంపికైనా కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోవడం కూడా వైయస్ జగన్ సూపర్ ఈగో వల్లనే అంటున్నారు. కిరణ్ ను అభినందించకుండా తన అంతరంగాన్ని వైయస్ జగన్ బయట పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా వైయస్ జగన్ ఓ ఆధిపత్య భావనతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసులోనే కాదు, రాష్ట్రంలోనే తనను మించిన నాయకుడు లేడనే ఓ విధమైన ఆధిక్య భావన ఆయనకు శాపంగా మారింది. అందుకే, మిగతా నాయకులతో కలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. తానే అందరి కన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, అందరూ తననే గౌరవించాలని, తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన కోరుకుంటారు. అదే ఆయనను రాజీనామా దారి పట్టించిందని చెప్పవచ్చు.
మరోవైపు, రోశయ్యను దించేసి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో తనకు అవకాశం రాదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పవచ్చు. పిసిసి పదివి కూడా ఆయనకు దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలిసిపోయింది. దీంతో వైయస్ జగన్ కు బయటకు వెళ్లిపోయి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. పైగా, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పార్టీ అధిష్టానం మాటకు తలొగ్గారు. వైయస్ జగన్ కు ఆయన దూరం కావడానికి నిర్ణయించుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని అనుకోవడానికి గల పరిస్థితిని గానీ, వైయస్ వివేకా అంతరంగాన్ని గానీ తెలుసుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించిన పాపాన పోలేదు. వైయస్ వివేకా చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. వైయస్ వివేకానంద రెడ్డి తనను వ్యతిరేకించడం వల్ల కూడా వైయస్ ఈగో దెబ్బ తిన్నది.
మొత్తం మీద, ఓ సూపర్ మ్యాన్ లా తప్ప మరో రకంగా వైయస్ జగన్ ఉండలేరనేది స్పష్టమై పోయింది. అది ప్రాంతీయ పార్టీలో తప్ప కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలో సాధ్యమయ్యేది కాదు. ఆయన మనస్తత్వమే ఆయన రాజీనామా చేయడానికి కారణమైంది.
No comments:
Post a Comment