Monday, November 29, 2010

జగన్ ఈగోను దెబ్బ తీశారా?

కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే కనిపిస్తోంది. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమని ఎప్పుడో నిర్ధారణకు వచ్చిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఆపరేషన్ జరిపినట్లు గత వారం రోజుల పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వైయస్ జగన్ ఈగోను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటూనే ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా వైయస్ జగన్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీసేందుకు పూనుకుంది. తన తండ్రి వైయస్సార్ ప్రభుత్వంలో శాసనసభా స్ఫీకర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తనకు వ్యతిరేకంగా రంగంలోకి దింపుతున్నట్లు వైయస్ జగన్ కు అర్థమైంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగానే హుటాహుటిన వైయస్ జగన్ బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ సిఎల్పీ సమావేశం ప్రణబ్ అనుభవంతో వ్యూహాత్మకంగా చడీ చప్పుడు లేకుండా ముగిసింది. అది వైయస్ జగన్ కు తీవ్రమైన దెబ్బనే.

ముఖ్యమంత్రిగా ఎంపికైనా కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోవడం కూడా వైయస్ జగన్ సూపర్ ఈగో వల్లనే అంటున్నారు. కిరణ్ ను అభినందించకుండా తన అంతరంగాన్ని వైయస్ జగన్ బయట పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా వైయస్ జగన్ ఓ ఆధిపత్య భావనతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసులోనే కాదు, రాష్ట్రంలోనే తనను మించిన నాయకుడు లేడనే ఓ విధమైన ఆధిక్య భావన ఆయనకు శాపంగా మారింది. అందుకే, మిగతా నాయకులతో కలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. తానే అందరి కన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, అందరూ తననే గౌరవించాలని, తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన కోరుకుంటారు. అదే ఆయనను రాజీనామా దారి పట్టించిందని చెప్పవచ్చు.

మరోవైపు, రోశయ్యను దించేసి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో తనకు అవకాశం రాదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పవచ్చు. పిసిసి పదివి కూడా ఆయనకు దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలిసిపోయింది. దీంతో వైయస్ జగన్ కు బయటకు వెళ్లిపోయి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. పైగా, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పార్టీ అధిష్టానం మాటకు తలొగ్గారు. వైయస్ జగన్ కు ఆయన దూరం కావడానికి నిర్ణయించుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని అనుకోవడానికి గల పరిస్థితిని గానీ, వైయస్ వివేకా అంతరంగాన్ని గానీ తెలుసుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించిన పాపాన పోలేదు. వైయస్ వివేకా చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. వైయస్ వివేకానంద రెడ్డి తనను వ్యతిరేకించడం వల్ల కూడా వైయస్ ఈగో దెబ్బ తిన్నది.

మొత్తం మీద, ఓ సూపర్ మ్యాన్ లా తప్ప మరో రకంగా వైయస్ జగన్ ఉండలేరనేది స్పష్టమై పోయింది. అది ప్రాంతీయ పార్టీలో తప్ప కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలో సాధ్యమయ్యేది కాదు. ఆయన మనస్తత్వమే ఆయన రాజీనామా చేయడానికి కారణమైంది.

డిసెంబర్ 1న లేదా 10న వైయస్ జగన్ కొత్త పార్టీ ప్రకటన?

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ డిసెంబర్ 1వ తేదీన లేదా పదవ తేదీన తన కొత్త పార్టీ గురించి ప్రకటించే అవకాశం ఉంది. తన రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, లోకసభ స్పీకర్ మీరా కుమార్ కు పంపిన తర్వాత ఒక్కసారిగా కలకలం మొదలైంది. సోనియా గాంధీకి రాసిన ఐదు పేజీల లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఆనంతరం సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాల సమయంలో తన కార్యాలయం నుంచి నివాసానికి వెళ్లిపోయారు.

వైయస్ జగన్ సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. గురువారంనాడు ఇడుపులపాయకు రావాల్సిందిగా ఆయన తన అభిమానులకు సూచిస్తున్నారు. దాన్ని బట్టి గురువారంనాడు కొత్త పార్టీ గురించి ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు కాకపోతే పదవ తేదీన ఆయన తన పార్టీ గురించి మాట్లాడే అవకాశం ఉంది.

కాగా, త్వరలోనే వైయస్ జగన్ పార్టీ పెడతారని వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా అదే విషయం చెప్పారు. కొండా సురేఖ వంటివారు మాత్రం పార్టీ గురించి వైయస్ జగన్ తమతో మాట్లాడలేదని అన్నారు

చరణ్ ‘ఆరెంజ్’ పై రకరకాల కాంటెస్ట్ లు రకరకాల ప్రైజ్ లు..

ఆరెంజ్ రిలీజ్ కి సరిగ్గా ఒక్క రోజు ముందు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం అక్కడ హల్ చల్ చేస్తున్నాడు. అభిమానులతో వీలయినంత వరకూ ఇంటరాక్ట్ అవుతూ, ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, అసలెందుకు ఈ చిత్రం చేసింది వంటి విశేషాలను తెలుపుతూ, ‘ఆరెంజ్’ ని ప్రమోట్ చేయడానికి కూడా చరణ్ ట్విట్టర్ వాడుతున్నాడు. ఈ చిత్రంలో తన కాస్టూమ్స్ కి బెస్ట్ కాంప్లిమెంట్స్ రావడంతో వాటి మీదే కాంటెస్ట్ పెట్టాడు. ఇందులో తాను ఎన్ని డ్రస్సులు వేసుకున్నదీ కరెక్ట్ గా చెప్పిన వారిలోంచి ఒకరిని సెలక్ట్ చేసి ‘ఆరెంజ్’లో వేసుకున్న షర్ట్ ఇస్తానని చరణ్ ప్రకటించాడు. మరో కాంటెస్ట్ కూడా ఇలాంటిదే దానికేమో లక్కీ విన్నర్స్ ని ఎంపిక చేసి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో కపుల్ టికెట్స్ తో స్పెషల్ షోష్ చూపించారని సమాచారం. ఇలాంటి కాంటెస్ట్ లు మనకి కొత్తవేమీ కాకపోయినా డైరెక్ట్ గా ఒక హీరోనే ఇలా కాంపిటీషన్ కండక్ట్ చేయడం మాత్రం ఫస్ట్ టైమ్ అనాలి.

ఈ కాంటెస్ట్ వల్ల ఆరెంజ్ కి కొత్తగా యాడ్ అయ్యే బెనిఫిట్ ఏమిటో తెలీదు కానీ ఫాన్స్ కి మాత్రం చరణ్ ని ఇది మరింత దగ్గర చేస్తోంది. ముఖ్యంగా ఆరెంజ్ చిత్రానికి వస్తున్న బ్యాడ్ టాక్ ని కూడా చరణ్ పట్టించుకోకుండా ప్రయత్నం వరకే తనది, ఫలితం తన చేతుల్లో లేనిది అన్నట్టు ప్రవర్తిస్తుండటం వారికి ఆనందాన్నిస్తోంది.

Hot Beauty Mudga Gadse


చిరంజీవి పార్టీలో చిచ్చు: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా?

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి వైయస్ జగన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. కాగా, వైయస్ జగన్ రాజీనామా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరాలా, వద్దా అనే విషయంపై చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో చేరే విషయంపై లేదా ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. తమ 18 శాసనసభ్యుల్లో 16 మంది శాసనసభ్యులు కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతిస్తారని, తన వెంట నడుస్తారని ఆయన చెప్పినట్లు సమాచారం. శోభా నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డిలపై ఆయన అమమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే దీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెసుకు శాసనసభలో 156 మంది శాసనసభ్యులున్నారు. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి 11 మంది, మజ్లీస్ కు ఏడుగురు, సిపిఐకి ఏడుగురు, సిపిఎంకు ఒక్కరు, తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి కనీసం 147 మంది శాసనసభ్యుల బలం అవసరం. వైయస్ జగన్ వర్గం వెళ్లిపోయినా అంతకన్నా ఎక్కువే బలం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం విశ్వాసంతో ఉంది. వైయస్ జగన్ వెంట 15 మందికి మించి శాసనసభ్యులు వెళ్లిపోరనే విశ్వాసంతో ఉంది. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 16 మంది మద్దతిస్తారని భావిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా జగన్ వెంట 26 మంది శాసనసభ్యులు వెళ్లిపోయినా నష్టం లేదనే భావనతో కాంగ్రెసు నాయకత్వం ఉంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదని, అందు వల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రాదని అంటున్నారు. మజ్లీస్ కూడా కాంగ్రెసు వైపే ఉండే అవకాశం ఉంది. తెరాస మద్దతివ్వకపోవచ్చు. తెరాస మద్దతు తీసుకోవాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ డిమాండ్ ను ఆ పార్టీ మరోసారి ముందుకు తేవచ్చు. అందువల్ల తెరాస మద్దతు తీసుకునే వైపుగా ఆలోచన చేయకపోవచ్చు. ఇతరులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వైయస్ జగన్ కు లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. పరిస్థితిని గమనించే జగన్ వర్గం ఆ విధమైన వాదనలను ముందుకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.

కాగా, వైయస్ జగన్ వెంట ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వైయస్సార్ పై సానుభూతితో అప్పట్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది సంతకాలు చేశారని, తాను కూడా సంతకం చేశానని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ మాటల్లో రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్సించారు. ఎవరో పార్టీ పెడతారని కాంగ్రెసును వీడి వెళ్లేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసే విషయంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్ది వైయస్ జగన్ కు మద్దతు తగ్గుతూ పోతుందని కాంగ్రెసు అంచనా. దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు