
కాగా, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే దీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెసుకు శాసనసభలో 156 మంది శాసనసభ్యులున్నారు. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి 11 మంది, మజ్లీస్ కు ఏడుగురు, సిపిఐకి ఏడుగురు, సిపిఎంకు ఒక్కరు, తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి కనీసం 147 మంది శాసనసభ్యుల బలం అవసరం. వైయస్ జగన్ వర్గం వెళ్లిపోయినా అంతకన్నా ఎక్కువే బలం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం విశ్వాసంతో ఉంది. వైయస్ జగన్ వెంట 15 మందికి మించి శాసనసభ్యులు వెళ్లిపోరనే విశ్వాసంతో ఉంది. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 16 మంది మద్దతిస్తారని భావిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా జగన్ వెంట 26 మంది శాసనసభ్యులు వెళ్లిపోయినా నష్టం లేదనే భావనతో కాంగ్రెసు నాయకత్వం ఉంది.
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదని, అందు వల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రాదని అంటున్నారు. మజ్లీస్ కూడా కాంగ్రెసు వైపే ఉండే అవకాశం ఉంది. తెరాస మద్దతివ్వకపోవచ్చు. తెరాస మద్దతు తీసుకోవాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ డిమాండ్ ను ఆ పార్టీ మరోసారి ముందుకు తేవచ్చు. అందువల్ల తెరాస మద్దతు తీసుకునే వైపుగా ఆలోచన చేయకపోవచ్చు. ఇతరులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వైయస్ జగన్ కు లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. పరిస్థితిని గమనించే జగన్ వర్గం ఆ విధమైన వాదనలను ముందుకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.
కాగా, వైయస్ జగన్ వెంట ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వైయస్సార్ పై సానుభూతితో అప్పట్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది సంతకాలు చేశారని, తాను కూడా సంతకం చేశానని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ మాటల్లో రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్సించారు. ఎవరో పార్టీ పెడతారని కాంగ్రెసును వీడి వెళ్లేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసే విషయంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్ది వైయస్ జగన్ కు మద్దతు తగ్గుతూ పోతుందని కాంగ్రెసు అంచనా. దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు
No comments:
Post a Comment